నవ ఆవిష్కరణలతోనే సంపద సృష్టి సాధ్యమవుతోంది - సీఎం చంద్రబాబు నాయుడు

నవ ఆవిష్కరణలతోనే సంపద సృష్టి సాధ్యపడుతుందని.. తద్వారా పేదరిక నిర్మూలనకూ, సంక్షేమ పథకాల సుస్థిర అమలుకు వీలవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సీ-ప్లేన్ సౌకర్యంతో రవాణాతో పాటు పర్యాటక రంగంలోనూ విప్లవాత్మక మార్పులతో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్ని కష్టాలున్నా రాష్ట్రాన్ని నెం.1గా నిలబెట్టే వరకు నిద్రపోకుండా పనిచేస్తామని పునరుద్ఘాటించారు. వీలైనంత తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాను. ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను. మూడుసార్లూ ఎప్పుడూ ఇంత కష్టమనిపించలేదు. ఈసారి మాత్రం విధ్వంసం అయిన వ్యవస్థను బాగుచేయడానికి చాలా సమస్యలున్నా విడవకుండా పరిపాలనను గాడిలో పెట్టేబాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం విజయవాడ పున్నమి ఘాట్ వద్ద సీ-ప్లేన్ డెమో లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.
-కేంద్రం సహకారంతో స్వయంకృషితో రాష్ట్రాన్ని నెం.1గా నిలబెడతాం.
ఆంధ్రప్రదేశ్ అంటే నిన్నటి వరకు అపహేళనగా చూసేవారు. ఎక్కడచూసినా గుంతలే ఉంటాయి.. పట్టణాల్లో ఎక్కడచూసినా చెత్తే.. అంటూ హేళనచేసే పరిస్థితి ఉండేది. ఇలాంటి పరిస్థితుల్ని చక్కదిద్ది ఏపీని మళ్లీ నెం.1గా నిలిపే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్రంలోని యువతకు, మేధావులకు తెలియజేస్తున్నాను. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 93 శాతం స్ట్రైకింగ్ రేటుతో గెలిపించారు. రాష్ట్రాన్ని నిలబెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తీసుకొస్తున్నాం. దీనికి కొంత సమయం పడుతుంది. కేంద్రం సహకారంతో, స్వయం కృషితో పనిచేసి రాష్ట్రాన్ని నెం.1గా నిలబెడతానని హామీ ఇస్తున్నాను.
What's Your Reaction?






