కనిగిరి రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా- ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

కనిగిరి రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా
- పూడిక తీసి 4 TMC ల నీటి నిలువకు కృషి.
- రివీట్మెంట్ నిర్మాణం చేపట్టి కరకట్టల పటిష్టం చేయిస్తా.
- ఆయకట్టు చివరి ఎకారాకు కూడా సాగునీరందిస్తా.
- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
జనసాక్షి :కోవూరు నియోజకవర్గ పరిధిలో రైతాంగ ప్రయోజనాల కోసం పాటుపడతానన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కనిగిరి రిజర్వాయర్ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటి విడుదల కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి బుచ్చిరెడ్డి పాళెం మండల నాయకులు రైతులు ఘన స్వాగతం పలికారు. బుచ్చి, కోవూరు, విడవలూరు, కొడవలూరు మండలాల రైతుల విజ్ఞప్తి మేరకు నారు మళ్ల అవసరాల కోసం ఆమె సదరన్ ఛానల్ ద్వారా 100 ఈస్ట్రన్ ఛానల్ ద్వారా 80 క్యూసెక్కుల నీళ్లు విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ కనిగిరి రిజర్వాయర్ లో గత కొన్నేళ్లుగా పూడిక తీయని కారణంగా పూర్తి సామర్ధ్యం మేరకు నీళ్లు నిల్వ చేయలేకపోతున్నట్లు రైతు సంఘ నాయకులు తన దృష్టికి తెచ్చారన్నారు.
పూడిక తీయడమా.. ఎత్తు పెంచి కరకట్ట పటిష్టంగా ఉండేలా రివీట్ చేయించడమా అన్న విషయం పై సీనియర్ ఇరిగేషన్ ఇంజినీర్ల సలహా తీసుకొని ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి రిజర్వాయర్ పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం కనిగిరి రిజర్వాయర్ లో 2 TMC ల నీళ్ళున్నాయని సోమశిల జలాశయం నుంచి సంగం బ్యారేజి ద్వారా కనిగిరి రిజర్వాయర్ కు 500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుందన్నారు. సోమశిల డ్యామ్ లో దాదాపు 66 TMC లకు పైగానే నీటి నిల్వలున్న నేపథ్యంలో నెల్లూరు డెల్టా ప్రాంత రైతాంగానికి ఎటువంటి సాగునీటి సమస్యలు రావని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కనిగిరి రిజర్వాయర్ ఆధునీకరించి పర్యాటక కేంద్రగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హామీ యిచ్చారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి పాళెం మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, బుచ్చి మండల టిడిపి అర్బన్, రూరల్ మండల అధ్యక్షులు ఎంవి శేషయ్య, యర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఏటూరి శివరామ కృష్ణా రెడ్డి, శివయ్య తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






