రైల్వే సమస్యలపై కేంద్రమంత్రి తో వేమిరెడ్డి

రైల్వే సమస్యలపై కేంద్రమంత్రితో ఎంపీ వేమి రెడ్డి
నెల్లూరు జిల్లాలో రైల్వే పరంగా ఉన్న పలు సమస్యలను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు కేంద్ర రైల్వే శాఖమంత్రి అశ్వని వైష్ణవ్ గారి దృష్టికి తీసుకువెళ్లారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ వేమిరెడ్డి.. ఈ సందర్భంగా పలు సమస్యలపై ఆయనతో చర్చించారు. జిల్లాలో లెవెల్ క్రాసింగ్లను తొలగించడంలో భాగంగా, కావలి యార్డ్, వేదాయపాళెం, అల్లూరు రోడ్డు, వెంకటాచలం, గూడూరు, పడుగుపాడు, తెట్టు-ఉలవపాడు, వెంకటేశ్వరపాలెం మొదలైన వాటిలో 11 లెవెల్ క్రాసింగ్ లను రైల్వే శాఖ గుర్తించిందన్నారు. వీటిపై ఆర్వోబి(ROB), లేదా ఆర్యూబి(RUB ) లను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కావలి యార్డు, తెట్టు-ఉలవపాడులో మాత్రమే పనులు నత్తనడకన సాగుతుండగా, మరికొన్ని నిర్మాణ దశకు చేరుకోలేదని కేంద్రమంత్రికి వివరించారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని, మిగిలిన ప్రాజెక్టుల పరిశీలన, అలైన్మెంట్ ప్లాన్, టెండరింగ్ మొదలైన వాటికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.
నడికుడి- శ్రీ కాళహస్తి పనులు వేగవంతం చేయండి..
రూ.2,333 కోట్ల బడ్జెట్‌తో 309 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు కానున్న నడికుడి-శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైను పనులు నత్తనడకన సాగుతున్నాయని, పనులను వేగవంతం చేయాలని ఎంపీ వేమిరెడ్డి.. కేంద్రమంత్రిని కోరారు. ఇప్పటివరకు కొత్త పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం, గుండ్లకమ్మ - దర్శి మధ్య నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ మధ్య కేవలం 74 కిలోమీటర్ల మేర పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. 235 కిలోమీటర్ల పొడవున బ్యాలెన్స్ లైన్ వేయాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చెన్నై-కోల్కత్తా రైల్వే లైన్‌కి ప్రత్యామ్నాయంగా ఈ రైల్వేలైన్ ఉపయోగపడుతుందన్నారు.
బిట్రగుంట అభివృద్ధిపై దృష్టి పెట్టండి...
నెల్లూరు జిల్లాలో దాదాపు 700 ఎకరాల్లో ఉన్న బిట్రగుంట రైల్వే అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉందని ఎంపీ.. కేంద్రమంత్రికి వివరించారు. ఇప్పటికే పలుమార్లు ఈ విషయంపై ఆయన్ను కలిసిన ఎంపీగారు.. మరో సారి ఈ విషయమై విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 420 ఎకరాల భూమి వినియోగానికి ఖాళీగా ఉందన్నారు. అన్ని వసతులు ఉన్న బిట్రగుంట ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే రైల్వే పరంగా ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. కృష్ణపట్నం ఓడరేవు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం ఓడరేవు బిట్రగుంట నుంచి 20- 45 కి.మీ.ల దూరంలోనే ఉన్నాయన్నారు. అలాగే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సంబంధించి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ యూనిట్‌ను బిట్రగుంటలో ఏర్పాటు చేయవచ్చని వివరించారు.
What's Your Reaction?






