మోంతా తుఫాన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం - కలెక్టర్
మోంతా తుఫాన్ ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం
144 రిలీఫ్ కేంద్రాలు, ఎన్ డి ఆర్ ఎఫ్ ఒకటి, ఎస్ డి ఆర్ ఎఫ్ ఒక బృందాన్ని సిద్ధంగా ఉంచాం*
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు, అక్టోబర్ 26: బంగాళాఖాతంలో ఏర్పడుతున్న 'మోంతా' తుఫాను నేపథ్యంలో.. దానిని ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయి ముందస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. ఈ మేరకు మోంతా తుఫాన్ ను ఎదుర్కొనేందుకు తీసుకున్న ముందస్తు చర్యలపై ఆదివారం కలెక్టర్ ఒక ప్రకటనలో వివరించారు.జిల్లాలో 9 తీర మండలాలు ఉండగా, వీటిలో 42 సెన్సిటివ్ గ్రామాలు, 166 హాబిటేషన్లు గుర్తించామన్నారు. తుఫాన్ ప్రభావం సమయంలో ప్రజలకు సురక్షిత ఆశ్రయం కల్పించేందుకు 144 రిలీఫ్ సెంటర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. అక్టోబర్ 25న తహశీల్దార్లు, ఎంపీడీవోలు ఈ కేంద్రాలను పరిశీలించారని, అన్ని సెంటర్లు అక్టోబర్ 26 రాత్రి (ఆదివారం) 8 గంటలలోగా పూర్తిగా కార్యాచరణలోకి వస్తాయని కలెక్టర్ తెలిపారు.అవసరమైతే ఈ రిలీఫ్ కేంద్రాలను ఉపయోగించుకుంటామని తెలిపారు.జాతీయ, రాష్ట్ర రహదారుల్లో 27 ప్రదేశాలు, రైల్వే మార్గాల్లో 16 ప్రదేశాలు వరదలకు లోనయ్యే అవకాశం ఉందని గుర్తించినట్లు చెప్పారు. 377 చౌక దుకాణాలతో రిలీఫ్ సెంటర్లను అనుసంధానించి, అవసరమైన పిడిఎస్ బియ్యం సరఫరా దాదాపు పూర్తయిందని తెలిపారు.తుఫాన్ సమయంలో గర్భిణులు, పాలిచ్చే తల్లులు, వృద్ధులు సురక్షితంగా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని కలెక్టర్ చెప్పారు. వచ్చే వారం రోజుల్లో ప్రసవ తేదీ ఉన్న 312 మంది గర్భిణులను గుర్తించామని, అందులో 45 మంది అధిక ప్రమాద గర్భధారణ గలవారికి రవాణా సౌకర్యంతో ఆసుపత్రికి అనుసంధానం పూర్తి చేసినట్లు తెలిపారు.సెన్సిటివ్ ప్రాంతాల్లో కూరగాయలు అందుబాటులో ఉంచేందుకు 82 డీసెంట్రలైజ్డ్ రైతు బజార్లు ఏర్పాటు చేశామని, విజయ డెయిరీ ద్వారా పాలు సరఫరా నిరాటంకంగా కొనసాగుతుందని ఆయన చెప్పారు.తాగునీటి సరఫరా కు ఇబ్బందులు లేకుండా డీటీఆర్‌లు, కండక్టర్స్ లను డీసెంట్రలైజ్డ్ విధానంలో సిద్ధంగా ఉంచగా, 35 సీపీడబ్లుఎస్ పథకాలకి బ్యాకప్ పవర్ ఏర్పాటు చేసినట్లు, 823 ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో క్లోరినేషన్ పూర్తి చేశామని తెలిపారు. తాగునీటి సరఫరాకై 800 ఆర్వో ప్లాంట్లు సిద్ధంగా ఉన్నాయని, అలాగ్ 40 వేల నీటి క్యాన్లు సేకరించి అందుబాటులో ఉంచామన్నారు.ప్రతి గ్రామంలో మురికినీటి నిల్వలు, వ్యాధులు వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్ పౌడర్, హైపోక్లోరైట్ ద్రావణం, (NaOCl సొల్యూషన్), చీపుర్లు అందుబాటులో ఉంచామని కలెక్టర్ పేర్కొన్నారు. సోమశిల, కండలేరు ప్రాజెక్టులలో నీటి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోలను రియల్‌టైమ్‌లో మానిటర్ చేస్తున్నామని తెలిపారు. పెన్నా నది పరివాహక సమీప ప్రాంతాల్లో వరదలు ప్రభావం చూపే 40 సున్నిత ప్రదేశాలను గుర్తించి తాత్కాలిక మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని వివరించారు. బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్ టెల్, సంస్థలతో సమావేశం నిర్వహించి, 2100 మొబైల్ టవర్స్‌కు పవర్ బ్యాకప్ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. నెల్లూరులో ఒక ఎన్ డి ఆర్ ఎఫ్ (NDRF) బృందం, కావలిలో ఒక ఎస్ డి ఆర్ ఎఫ్ (SDRF) బృందాన్ని సిద్ధంగా ఉంచామని, అవసరమైతే వారి సేవలను వినియోంచుకుంటామని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆ ప్రకటనలో తెలిపారు.
What's Your Reaction?