డీజీ పేటలో జరిగిన ఇద్దరు మహిళ హత్య కేసులను చేదించిన పోలీసులు
సీఎస్.పురం మండలం డీజీ పేట గ్రామంలో జరిగిన ఇద్దరు మహిళల హత్య కేసులను మార్కాపురం జిల్లా పోలీసులు ఛేదించారు. నిందితుడు పావలి సురేష్ (32)ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి హత్యలకు ఉపయోగించిన ఆయుధాలతో పాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు పర్యవేక్షణలో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లభించకపోయినా, గతంలో ఇదే గ్రామంలో జరిగిన హత్య కేసు వివరాలను కూడా పరిగణనలోకి తీసుకుని సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు కొనసాగించారు.ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పావలి సురేష్‌పై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో 2026 ఆగస్టు 13న పావలి వెంకట సుబ్బమ్మ (56)ను, 2024 అక్టోబర్ 20న డేగ రత్తమ్మ (66)ను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.గడ్డి కోసం పొలాలకు వెళ్లి తిరిగి వస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసి, వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రెండు హత్యల్లోనూ గొడ్డలి, ఇనుప నాగలి కర్ర వంటి ఆయుధాలను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.నిందితుడి వద్ద నుంచి ఒక బంగారు గొలుసుతో పాటు కరిగించిన బంగారం ముక్క రూపంలో 27 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే హత్యలకు ఉపయోగించిన ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోచుకున్న బంగారు వస్తువుల్లో ఒకదాన్ని తాకట్టు పెట్టినట్లు, మరో వస్తువును ఇంట్లో దాచినట్లు విచారణలో వెల్లడైంది.రెండు సంవత్సరాల క్రితం జరిగిన హత్య కేసుతో పాటు తాజా హత్య కేసును కూడా ఛేదించడంలో కీలకంగా పనిచేసిన మార్కాపురం OSD నవజ్యోతి మిశ్రా, కనిగిరి ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీధర్ బాబు, సీఐలు డి. వినోద్ కుమార్, యు. శ్రీనివాస్, ఎం. రాజేష్, ఎస్.కె. ఖాజావలి, కమలాకర్, ఎస్‌ఐలు వెంకటేశ్వరరెడ్డి, అనుక్, కోటేశ్వరరావు, రాజేష్, నరసింహారావు, శివకృష్ణారెడ్డి, కోటయ్యలతో పాటు సీఐలు చరణ్, బాబురావు, గుంటూరు రేంజ్ క్రైమ్ పార్టీ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
What's Your Reaction?