కందుకూరు మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి- పాలేటి
కందుకూరు మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగాలి -దళిత, గిరిజన, బలహీన వర్గాల ఓటర్లకు ప్రత్యేక రక్షణ కల్పించాలి
ఎన్నికల అక్రమాలు, బెదిరింపులు, రిగ్గింగ్‌కు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి
పాలేటి కోటేశ్వరరావు డిమాండ్
ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో 14 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టాలని పాలేటి కోటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.దీర్ఘకాలం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సంద ర్భంగా నెలకొన్న ప్రశాంత వాతావరణం ప్రజాస్వామ్యానికి శుభపరిణామమని పేర్కొన్నారు. ఇదే విధమైన ప్రశాంత పరిస్థితులు పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు రోజున కూడా కొనసాగాలని ఆకాంక్షించారు.ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అక్రమాలకు, మోసాలకు, దాడులకు, బెదిరింపులకు, రిగ్గింగ్‌కు పాల్పడే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూ డదని స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని కోరారు.ముఖ్యంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించాలని, కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, వీడియో చిత్రీకరణ ద్వారా ప్రతి దశను రికార్డు చేయాలని సూచించారు. తద్వారా ఓట్ల లెక్కింపులో ఎలాంటి అనుమానాలకు, అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకతను పాటించాలని కోరారు.
దళిత, గిరిజన, బలహీన వర్గాల ఓటర్లకు ప్రత్యేక భద్రత కల్పించాలి
ప్రత్యేకించి దళిత, గిరిజన, బలహీన వర్గాల ప్రజలు అధికంగా నివసించే వార్డుల్లో ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. అవసరమైన చోట కేంద్ర బలగాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో నియమించాలని విజ్ఞప్తి చేశారు.బలహీన వర్గాల ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకోవడం, నిర్బంధించడం, బెదిరించడం లేదా ప్రలోభాలకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడే వారిపై ఎన్నికల చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, నేర తీవ్రతను బట్టి తక్షణమే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రౌడీషీటర్లు, బెదిరింపులకు పాల్పడే వారిపై ముందస్తు చర్యలు తీసుకోవాలి
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న రౌడీషీటర్లను, గతంలో రౌడీషీట్లు ఎత్తివేసినప్పటికీ తమ పాత ధోరణిని మార్చుకోకుండా బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు ముందుగానే గుర్తించాలని సూచించారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు, పైరవీలకు లొంగకుండా చట్టప్రకారం ముందస్తు బైండోవర్, నిర్బంధ చర్యలు చేపట్టి ఎన్నికలు ప్రశాం తంగా జరిగేలా చూడాలని కోరారు.ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను బెదిరింపులకు గురిచేసే వ్యక్తులపై నిఘా ఉంచి, అవసరమైన అభ్యర్థులకు ప్రత్యేక పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. ప్రతి అభ్యర్థి స్వేచ్ఛగా ప్రచారం చేసుకుంటూ, ప్రజల మద్దతు కోరుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా తమ గెలుపోటములను నిర్ణయించుకునే వాతావరణం కల్పించాలన్నారు.పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఓటర్లు మినహా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అనధికార వ్యక్తులు, అల్లరి మూకలు గుమిగూ డకుండా కఠినమైన నియంత్రణ చర్యలు అమలు చేయాలని సూచించారు.
-రాజ్యాంగ విలువలను కాపాడటం అధికారుల బాధ్యత
పోలీసు అధికారులు, ఎన్నికల సిబ్బంది, ఇతర ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎన్నికల సంఘం నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజాస్వామ్య ఎన్నికల పవిత్రతను కాపాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి మౌలిక విలువలను పరిరక్షించాలని కోరారు.
రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు విజ్ఞప్త
పవిత్రమైన భారత రాజ్యాంగ పరిధిలో జరిగే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు తమ వ్యక్తిగత బలాబలాల కంటే ప్రజల అభిమానం, విశ్వాసం, ఆదరణను సంపాదిం చుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎలాగైనా గెలవాలనే దురాలోచనతో అక్రమాలకు, అనైతిక చర్యలకు, బెదిరింపులకు పాల్పడకుండా నైతిక విలువలకు కట్టుబడి ఎన్నికల బరిలో నిలవాలని విజ్ఞప్తి చేశారు.ఎన్నికల్లో గెలుపోటముల కంటే ప్రజాస్వామ్య విలువలు, ప్రజల స్వేచ్ఛ, ఓటు హక్కు, సామాజిక న్యాయం ఎంతో ముఖ్యమైనవని ప్రతి ఒక్కరూ గుర్తించాలని పేర్కొన్నారు. కందుకూరు మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు.
పాలేటి. కోటేశ్వరరావు-SBI రిటైర్డ్ అధికారి
బ్యాంకు ఉద్యోగ, అధికారుల సంఘాల నాయకులు
దళిత మహాసభ వ్యవస్థాపక నాయకులు
అఖిల భారత మాల సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షులు
భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు
What's Your Reaction?