ఒంగోలు ఆర్టీసీ డిపో పరిధిలో ట్రాఫిక్, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు
-ఆక్రమణలు తొలగించేందుకు పోలీసులు, మున్సిపల్ సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్
జిల్లా కేంద్రమైన ఒంగోలు ఆర్టీసీ బస్టాండుకు వస్తున్న వారికి ప్రయాణం హాయిగా, సాఫీగా సాగేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బస్టాండు పరిసర ప్రాంతాలలో ఆక్రమణల తొలగింపు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రాంగణంలో పారిశుద్ధ్యముపై దృష్టి పెట్టారు. ఈ ప్రయాణ ప్రాంగణ ఇన్ గేటు పక్కనే ఉన్న స్మశానం వద్ద తోపుడు బండ్లు, ఇతర ఆక్రమణలను ఆర్టీసీ, పోలీస్, మున్సిపల్ సిబ్బంది ఆదివారం తొలగించారు. ఇక్కడ ఆటోలను క్రమ పద్ధతిలో నిలిపేలా, నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి అవి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. తద్వారా ఇతర ప్రాంతాల నుంచి ఒంగోలుకు వచ్చి బస్టాండుకు వెలుపలే దిగేవారు వీటిని ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, బస్టాండు ప్రాంగణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచారు. ఇక్కడ ఉన్న ఓపెన్ టాయిలెట్లను తొలగించారు. అధునాతన టాయిలెట్లను నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రాంగణం మొత్తం నిరంతరం శుభ్రంగా ఉంచేలా దృష్టి సారించారు. ఈ బస్టాండు నుంచి రాకపోకలు సాగించే వారికి ఎలాంటి అసౌకర్యము కలగకుండా ప్రయాణం హాయిగా, సాఫీగా సాగేలా పారిశుద్ధ్యము, ట్రాఫిక్ నియంత్రణ, మౌలిక సదుపాయాల కల్పనకు జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు ఆదేశాల మేరకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రీజనల్ మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. జిల్లాలోని మూడు డిపోలలో ప్రయాణికులకు స్వచ్ఛమైన త్రాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లను కూడా అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమాలలో ఆర్టీసీ ఆర్.ఎం.తో పాటు డిపో మేనేజర్ చంద్రశేఖర్, ట్రాఫిక్ సూపర్వైజర్ ఫణి కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ శివప్రసాద్, శానిటరీ ఇన్స్ పెక్టర్ బాబ్జి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
What's Your Reaction?