సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో ఇద్దరు చిన్నారులతో కలిసి దంపతుల ఆత్మహత్య
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఘోర విషాదం.. ఇద్దరు చిన్నారులతో కలిసి దంపతుల ఆత్మహత్య
జనసాక్షి సింగరాయకొండ, జూలై 14: ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో మంగళవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులతో కలిసి ఉన్న దంపతులు వేగంగా వస్తున్న గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో దంపతులతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, రైల్వే స్టేషన్ రెండో ప్లాట్‌ఫాం వద్ద కొంతసేపు ఇద్దరు చిన్నారులతో కలిసి మాట్లాడుకుంటున్న దంపతులు, అనంతరం వేగంగా వస్తున్న గూడ్స్ రైలును గమనించి ఒక్కసారిగా పిల్లలతో కలిసి పట్టాలపైకి దూకారు. ఈ ఘటనతో రైల్వే స్టేషన్‌లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుల వద్ద లభించిన డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా, మృతుడు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం ఆర్.వి. కండ్రిక గ్రామానికి చెందిన కే. హరికృష్ణగా గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మిగిలిన కుటుంబ సభ్యుల వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ విషాద ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
What's Your Reaction?