వెలుగొండతో ప్రకాశం జిల్లాకి నీళ్లు- అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యం సీఎం

Oct 9, 2026 - 16:02
Oct 9, 2026 - 16:04
 0  44
వెలుగొండతో ప్రకాశం జిల్లాకి  నీళ్లు- అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యం సీఎం

వెలిగొండతో ప్రకాశం జిల్లాకు నీళ్లు.. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం: సీఎం చంద్రబాబు

కొండపి సభలో అభివృద్ధి, సాగునీరు, సంక్షేమంపై కీలక ప్రకటనలు

 టంగుటూరు శిఖర జనసాక్షి :ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు నీటిని తీసుకువచ్చామని, రెండో దశను కూడా పూర్తి చేసి అన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. కొండపిలో జరిగిన సభలో ఆయన రాష్ట్ర అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణ మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, పెట్టుబడులు తదితర అంశాలపై మాట్లాడారు.                                     వెలిగొండ పూర్తి చేసి అన్ని ప్రాంతాలకు నీరు...గతంలో నీళ్లు రాకుండానే రిబ్బన్లు కట్ చేసి, జాతికి అంకితమంటూ కార్యక్రమాలు నిర్వహించినట్లు తాము చేయలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వెలిగొండ రెండో దశను పూర్తి చేసి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 40 చిన్నా, పెద్ద నదులను అనుసంధానం చేసి నీటి గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీటిని అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గోదావరి నుంచి కావేరి వరకు అనుసంధానం జరిగితే నాలుగు రాష్ట్రాల్లో నీటి కొరతను అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు.                         మూడేళ్లలో 36 ప్రాజెక్టుల పూర్తి లక్ష్యం...రాష్ట్రంలో రూ.35 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన 36 ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. భూగర్భజలాల పెంపునకు కూడా జలధార కార్యక్రమం కింద పెద్ద ఎత్తున చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జల్ జీవన్ మిషన్, జలధార కార్యక్రమాల ద్వారా రూ.31 వేల కోట్లతో ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వివరించారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు రూ.11 వేల కోట్లు..పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రూ.11 వేల కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని చెప్పారు.                                                   ఆరు లక్షల ఇళ్ల నిర్మాణానికి సన్నాహాలు....విజయవాడ, విశాఖపట్నం, మంగళగిరి వంటి ప్రాంతాల్లో 60 వేల మందికి రూ.52 వేల కోట్ల విలువైన నివాస స్థలాలపై హక్కులు కల్పించినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, అదనంగా మరో ఆరు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని త్వరలో చేపట్టనున్నట్లు ప్రకటించారు.

హార్టికల్చర్ హబ్‌గా ప్రకాశం, రాయలసీమ....ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలను అంతర్జాతీయ స్థాయి ఉద్యానవన పంటల కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు. వ్యవసాయం, ఉద్యానవన రంగాల అభివృద్ధి ద్వారా ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను పెంచడంతో పాటు రైతులకు మరిన్ని అవకాశాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.భారీ పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు....యువతకు ఉద్యోగాలు కల్పించేలా రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని ప్రాంతాల్లో సమతుల్య అభివృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో రిఫైనరీ ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు.

రామాయపట్నం పోర్టుతో ప్రాంతీయ అభివృద్ధి...రామాయపట్నం పోర్టు నిర్మాణం గతంలోనే పూర్తికావాల్సి ఉన్నప్పటికీ, గత పాలనలో నిర్లక్ష్యం జరిగిందని చంద్రబాబు విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టు పనులను వేగవంతం చేసి, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యం..సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజల అవసరాలను తీర్చడంతో పాటు యువతకు ఉపాధి, రైతులకు సాగునీరు, గ్రామీణ ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి సాధిస్తామని కొండపి సభలో చంద్రబాబు వివరించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow